మహేష్ కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ఎల్బీ స్టేడియంలో ఈనెల 20న ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ 21న ఉదయం ప్రారంభమైన ప్పటికి రాత్రి అర్ధంతరంగా కౌంటింగ్ ఆపేయడం జరిగిందని మహేష్ బ్యాంక్ షేర్ ఓల్డర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బాక్స్ లలో ఓట్లను లెక్కించకుండా ఫలితాలను ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ కోపరేటివ్ సొసైటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంకు మాజీ చైర్మన్ రమేష్ బంగ్, ప్యానల్ సభ్యులు మాట్లాడుతూ… దేశచరిత్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ మొదలుపెట్టి ఆపడం అనేది మొదటి సారి అని, ఇలా చేయడంలో ఉద్దేశం ఏంటో ఎన్నికల అధికారి ఇప్పటికీ చెప్పకపోవడం విడ్డూరమన్నారు. దీని వెనుక దాగిన కుట్ర, అదృష్ట శక్తులు ఎవరో అంతు పట్టడం లేదని దీని మతలబు ఏంటో బహిర్గతం చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి ఆబిడ్స్ పీఎస్ కు తరలించారు.