2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే వార్తలతో అన్ని పార్టీలు ఇప్పటినుంచే సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ హీట్ జోరందుకోగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాలకూ టీఆర్ఎస్‌ను చేరువ చేసేలా సీఎం కేసీఆర్ వరుసగా పథకాలు ప్రవేశపెడుతున్నారు. నానాటికీ టీఆర్ఎస్ బలం పుంజుకుంటుండగా ప్రతిపక్షాలు డీలా పడ్డాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా మహాకూటమి తెరమీదకు వచ్చింది. టీఆర్ఎస్,బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మహాకూటమితో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఈ కూటమిలో సీపీఐ, సీపీఎం, టీడీపీ-టీఎస్ పార్టీలతోపాటు టీజేఏసీని కూడా భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ మహాకూటమి ఏర్పాటు జరుగుతుందా అన్న సందేహం అందరిలో నెలకొంది.
ఎందుకంటే కాంగ్రెస్ ఏర్పాటుచేయబోయే మహాకూటమిలో చేరేందుకు కొన్నిపార్టీలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో పోత్తుకు విముఖత వ్యక్తం చేస్తూ సీపీఎం పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో సీపీఎం కొన్ని కులసంఘాలు,లెఫ్ట్ పార్టీలతో ఓ కూటమిని ఏర్పాటుచేసింది. గెలుపుఓటముల సంగతి పక్కన ఉంచితే 119 స్ధానాల్లో పోటీ చేసేందుకు
సిద్దంగా ఉన్నామని ఆ కూటమి నేతలు పేర్కొనడంతో వీరు మహాకూటమిలో చేరే అవకాశం లేనేలేదు.
ఇక మిగిలింది టీటీడీపీ,సీపీఐ,జేఏసీ కోదండరాం. తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో కంటే టీఆర్ఎస్‌తోనే పొత్తుకు మొగ్గుచూపుతున్నారు. ఆ పార్టీ సినీయర్ నేత మోత్కుపల్లి టీఆర్ఎస్‌తో పోత్తుకు సంబంధించి బహిరంగ ప్రకటనే చేసేశారు. మిగిలింది టీజేఏసీ,సీపీఐ. ఇప్పటికే టీజేఏసీ నుంచి అన్నిపార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా తప్పుకోవడంతో ఒంటరైన కోదండరాం ప్రభావం చూపే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవేళ సొంత పార్టీ పెట్టిన, కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలంగాణలో సీపీఐ పరిస్ధితి కూడా అంతంతా మాత్రంగానే ఉంది. ఆపార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి జంప్ కావడంతో ఇరకాటంలో పడ్డారు సీపీఐ నేతలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చే మహాకూటమి ప్రస్తావన పేపర్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఇవన్నింటిని పక్కన పెట్టి ఒకవేళ కూటమి ప్రతిపాదనను తీసుకొస్తే కాంగ్రెస్‌కే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రతిపాదన తీసుకొచ్చే పార్టీ ఎక్కువ సీట్లను వదులుకోవాల్సి వస్తుంది.ఇదే జరిగితే ఇప్పటికే పలు జిల్లాల్లో ఉన్న వర్గపోరుకు తోడు సీట్ల పంపకాలు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. దీంతో మహాకూటమి ప్రస్తావనకు ఆదిలోనే తెరపడే అవకాశాలు ఎక్కువ. రాజకీయ విశ్లేషకులు సైతం మహాకూటమి ఏర్పాటైన టీఆర్ఎస్‌కు వచ్చే ప్రమాదం ఏమి లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సో ఎవరెంతగా కలిసినా మదగజం లాంటి టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టి నిలబడటం మాత్రం ఈ చిట్టెలుకల వల్ల అయ్యేపని కాకపోవచ్చు. ఎక్కడైనా నాయకుల సొంత వైఫల్యాలు వెంటాడితే తప్ప.. మొత్తంగా టీఆర్‌ఎస్‌ను ఓడించి నిలబడగల సత్తా ఈ కూటములకు ఉంటుందని చెప్పలేం. అందువల్ల తెలంగాణలో పొత్తు లెన్ని ఉన్నా.. ఫలితం సున్నా.