యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భారీ వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనులు పూర్తి కావడంతో ఆలయ పునరావిష్కారానికి సమస్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి నిర్వహించే మహా కుంభ సంప్రోక్షణకు స్వయంభువుల సన్నిధి సిద్ధమైంది. స్వాతి నక్షత్రం మేషలగ్న శుభ ముహూర్తం (సోమవారం) లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఫాల్గుణ బహుళ ఏకాదశి (మార్చి 28) వరకు కొనసాగుతుంది. తొలిరోజు నుంచి పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం వారం పాటు పంచకుండాత్మక యాగాన్ని 108 మంది రుత్విక్కులతో నిర్వహిస్తారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీత, వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు వసతి ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, ప్రముఖుల రాక సందర్భంగా ప్రొటోకాల్ అమలు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాల నిర్వహణ, బస్సు సౌకర్యం తదితర సదుపాయాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.