మధ్యప్రదేశ్ రాజకీయం కీలక దశకు చేరుకుంది. కమల్‌నాథ్ సర్కారు ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకోవడం, తనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోవడానికి సిద్ధం కావడంతో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. నేడు అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సీఎం కమల్‌నాథ్‌ను గవర్నర్ లాల్జీ టాండన్ శనివారం రాత్రి ఆదేశించారు.
తన ప్రసంగం ముగిసిన వెంటనే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎంకు గవర్నర్ ఒక లేఖ పంపారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ‘ఈనెల 16 ఉదయం 11 గంటలకు నా ప్రసంగంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అటుపై విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహించాలి’ అని తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోనుంది. ఈ బలపరీక్షలో నెగ్గితేనే కమల్‌నాథ్ సీఎంగా కొనసాగుతారు. లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సింధియా వర్గంలోని ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్ గట్టెక్కుతారు. వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించనందున కాంగ్రెస్ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వ తంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం.