ఎలక్షన్‌ రిజల్ట్‌.. తొలి-చివరి ఫలితాలు ఎక్కడో తెలుసా..?

143
Election Results

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్‌ 11న) పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని తెలుస్తున్నది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది.

రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు పోలీస్‌శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసింది. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు సీఆర్పీసీ సెక్షన్ 144 అమలుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలవద్ద పదివేల మంది సాయుధ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.