హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలకమైన ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ప్రకటించడం దాదాపుగా ఖరారు అయింది. దీంతో గత కొంత కాలంగా లెఫ్ట్ పార్టీలతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లైంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు అధికార టీఆర్ఎస్‌కు జై కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిపిఎం పార్టీ ఈ నిర్ణయం తీసుకోగా.. సిపిఐ పార్టీ కూడా అదే బాటలో వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే దీనిపై జాతీయ నాయకత్వంతో రాష్ట్ర సిపిఐ పార్టీ చర్చలు జరిపినట్లు సమాచారం.
మరో రెండు రోజుల్లోనే హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఎర్రన్నలు అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే గత కొన్నాళ్లుగా కమ్యూనిస్టులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగతూ, వచ్చే ఎన్నికల్లో టీజేఎస్, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి…. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలని ప్లాన్ వేసిన రేవంత్ రెడ్డి…. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డితో పాటు పలు అంశాలపై అఖిల పక్ష భేటీలు జరిపి కేసీఆర్ సర్కార్‌పై ఉమ్మడి పోరుకు రెడీ అయిన వామపక్షాలు ఇలా సడన్‌గా తమ మనసు మార్చుకుని హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లుకు మద్దతు ఇవ్వడం వెనుక అసలు కారణాలేంటని కాంగ్రెస్ నేతలు ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తొలుత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ నుంచి డ్రాప్ అవడంతో ఓ దశలో అఖిలపక్షం తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ రెడ్డి భావించాడు. అయితే అప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కుమ్మక్కు అయిన రేవంత్ రెడ్డి మళ్లీ అఖిలపక్షం తరపున ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటే..అన్ని పార్టీలు గెలుపు కోసం పట్టుదలగా పని చేస్తాయి…అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓడిపోవాల్సి వస్తుందని భావించాడు..దీంతో ఉమ్మడి అభ్యర్థి విషయాన్ని పక్కన పడేసాడు.
అంతే కాదు కోదండరామ్‌తో కలిసి, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ వంటి కొన్ని పార్టీలను ఈటలకు మద్దతుగా రంగంలోకి దింపాడు. కాషాయం పేరెత్తితే భగ్గుమనే కమ్యూనిస్ట్ పార్టీలు హుజురాబాద్‌లో ఆ పార్టీ ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలపై మండిపడ్డాయి. ఇటీవల లఖింపూర్ ఖేరీలో జరిగిన కాషాయ హత్యాకాండతో బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించాలని ఎర్రన్నలు ఫిక్స్ అయ్యారు. అందుకే హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చి ఈటలను ఓడించాలని ఎర్రన్నలు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయమై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటన కూడా ఇచ్చేశారు. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలు గులాబీ పార్టీకి జై కొట్టడంతో ఇటు రేవంత్ గ్యాంగ్‌లో, అటు కాషాయ క్యాంప్‌లో కలకలం రేపుతోంది. మరి ఎర్రన్నలు టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి.