రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి విశ్వనటుడు కమల్ హాసన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభలో ఆయన తన పార్టీ పేరును ప్రటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా కమల్ నుంచి ఆహ్వానం అందింది.
అయితే, ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన కమల్ కు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నానని, నిజ జీవిత ‘నాయకుడు’ కూడా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
ఇందుకు స్పందించిన కమల్..‘థ్యాంక్యూ కేటీఆర్ జీ. మీ రాకను మిస్సవుతున్నాం. భవిష్యత్తులో జరిగే మా కార్యక్రమాలకు మీరు హాజరై వాటికి మరింత శోభను తీసుకు వస్తారని భావిస్తున్నా అని కమల్ పేర్కొన్నారు.
సాయంత్రం జరిగే బహిరంగసభలో తన పార్టీ జెండా ఆవిష్కరించి, రాజకీయ పార్టీని ప్రకటిస్తారు. ఇదే వేదికపై నుంచి తన పార్టీ రాజకీయ విధానాలు, సిద్ధాంతాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు వామపక్ష నేతలు పాల్గొననున్నారు. అన్నాడీఎంకే నేతలకు మాత్రం కమల్ ఆహ్వానం అందించలేదు.