యూఏఈలో ప్రకటించిన అమ్నెస్టీ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తెలంగాణకు తిరిగివచ్చిన గల్ఫ్ ప్రవాసులకు మంత్రి కేటీ రామారావు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అమ్నెస్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణకు సాధ్యమైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని యూఏఈకి పంపింది. గతవారం అక్కడికి చేరుకున్న బృందం అక్కడితో తెలంగాణ సంఘాలు, అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులతో కలిసి అమ్నెస్టీ సౌకర్యాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందేలా చర్యలు తీసుకుంది. స్థానిక లేబర్ క్యాంపులను సందర్శించడంతో పాటు, భారత రాయబార కార్యాలయంలోనూ ప్రత్యేక అవగాహన సమావేశాలను నిర్వహించడం జరిగింది.
గత వారం రోజులుగా బృందాలుగా తెలంగాణకి అనేకమంది కార్మికులు చేరుకున్నారు. ఈ రోజు మరో 30 మంది గల్ఫ్ ప్రవాసీలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికిన ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కేటీ రామారావు వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్‌లో సరైన వీసాలు లేకుండా వలస వెళ్లిన వారికి ఎదురవుతున్న ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అమ్నెస్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని వెనక్కి తిరిగి వచ్చేందుకు ముఖ్యంగా టికెట్ల కొనుగోళ్లతో పాటు చిన్న చిన్న జరిమానాలను చెల్లించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో అనేక మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇప్పటికే అవసరమైనవారికి టికెట్లను ప్రభుత్వమే సమకూరుస్తుందని.. జరిమానాల విషయంలోనూ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అబుదాబిలో తెలుగు భాష వచ్చే అధికారులు అందుబాటులో ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఇతర అంశాల పైన కూడా తానే స్వయంగా అక్కడి రాయబారితో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తుందని, ఇక్కడే వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గల్ఫ్ కి వలస వెళ్లి తిరిగి వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ సంస్థలతో పాటు నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ వంటి సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఈ మేరకు గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన వారితో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
తిరిగివచ్చిన వారిని ప్రత్యేక వాహనాలను సమకూర్చి వారి వారి ఇళ్ల వరకు దిగ పెట్టాలని ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ అమ్నెస్టీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ ఫోన్ నంబర్ 9440854433 లేదా అధికారులను సంప్రదించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ప్రవాసీలను స్వాగతం పలికేందుకు వచ్చిన వారిలో స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎంపీ మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, మహేష్ బీగాల తదితరులు ఉన్నారు.