ఈరోజు తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలింది. సీఎం కేసీఆర్ సభలో నాగార్జున సాగర్ దివంగత నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతు మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడతూ.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీన వర్గాల బాంధవుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా నోములతో అనుబంధం ఉందన్నారు.
అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా నోములకు పేరుంది. ఎన్నో సందర్భాల్లో ఆయన తెలంగాణ గురించి మాట్లాడేవారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జనాభా ఉండే మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియాను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశాం. ఈ మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించాలి అని నోముల తనను పదేపదే కోరేవారు. నోముల మరణం సాగర్ నియోజకవర్గానికే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటు.. నోముల మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.