శనివారం హైదరాబాద్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. టీఎస్ఎండీసీ ఇసుక తవ్వకాలు, సరఫరాపైనే కాకుండా ఇతర గనుల తవ్వకాలు, అన్వేషణ, వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో గనుల తవ్వకాలు, అన్వేషణ, మార్కెటింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. మాంగనీస్, మార్బుల్, సున్నపురాయి, ఇతర ఖనిజాలపై దృష్టిపెట్టాలని.. గ్రానైట్ నిల్వలు, మార్కెటింగ్ పై సమగ్ర కార్యచరణపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు.
గ్రానైట్ లీజుల కేటాయింపుల్లో టీఎస్ఎండీసీకి ప్రాధాన్యం ఇవ్వాలని గనుల శాఖ డైరెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో భారీగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నందున మరింత సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. టీఎస్ఎండీసీకి అవసరమైన సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. మరోవైపు రాష్ట్రంలో ఇసుక పాలసీకి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్. దీన్ని మరింత సౌకర్య వంతంగా అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఇసుక డిపోల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భారీ ఎత్తున ఇసుక నిల్వ చేయడానికి అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని సూచించారు. వడ్డెర సొసైటీలను ఏర్పాటు చేసి రాతి ఇసుక యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, గనుల శాఖ డైరెక్టర్ బీవీ సుశీల్ కుమార్, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులతో పాలు పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.