పైసల కోసమే ఉపఎన్నిక తెచ్చిన కోవర్టురెడ్డి:కేటీఆర్‌

116
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో నవంబర్‌6వ తేదీన మీ ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. చౌటుప్పల్‌ కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ పాల్గొన్ని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… చౌటుప్పల్ వస్తుంటే.. యువత అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. మీ ఊపు, జోష్ చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ వస్తదో, రాదో అనుమానం కొడుతున్నదని కేటీఆర్ తెలిపారు.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నదని.. దాని నిర్మూలించేందుకే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రారంభించారు. నీతి ఆయోగ్‌ ఆ ప్రాజెక్టును ప్రశంసించి, రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు.

రాజగోపాల్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇక్కడ చొరబడుతున్నాడు. అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతుండంట. ఆ తులం బంగారం తీసుకోండి.. ఓటు మాత్రం అండగా ఉన్న కారు గుర్తుకు వేయండి. ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు. మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనేందుకు ఎర వేస్తున్నారు. డబ్బు అహంకారానికి ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2018లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన మరుసటి రోజు నుంచే బీజేపీ పాట పాడారు. బీజేపీతో కోవర్ట్ రాజకీయాలు చేసి, బేరసారాలు ఆడారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత గుజరాతీ బాస్‌ ల వద్ద మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడు.

మునుగోడు నియోజకవర్గ సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం అహంకారంతోనే.. అంగడి సరుకు మాదిరిగా ఓటర్లను కొనేస్తా అని బలవంతంగా ఎన్నిక రుద్దారు. ఇది మునుగోడు ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పల్లెల్లో, పట్టణాలకు వెళ్తే తెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు.. ఎవరైనా చనిపోయి అంత్యక్రియలకు పోతే.. అర్ధగంట కరెంట్ ఇవ్వమని అడుక్కున్నాం. విత్తనాలు, ఎరువుల కోసం గోసపడ్డాం. అన్నింటిని ఎదుర్కొని పంట పండిస్తే కనీసం మద్దతు ధర లభించకపోయేది. కొనుగోలు కేంద్రాలు లేవు. కానీ ఇప్పుడు అన్ని వసతులు మన ముందుకు వచ్చాయి. తెలంగాణ రైతులు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఒకనాడు నల్లగొండ అంటే నీళ్లు లేని ప్రాంతం. ఈ రోజు మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించే జిల్లా నల్లగొండ అని చెప్పొచ్చు. ఇది కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైంది.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేది. పిల్లను ఇచ్చేందుకు కూడా ఆలోచించే పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక.. ఇంటి ముందే నల్లా పెట్టి, సురక్షిత తాగునీరు అందిస్తున్నాం. మిషన్ భగీరథ పైలాన్‌కు చౌటుప్పల్‌లో పైలాన్ వేసి, ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. నాలుగేండ్లలోనే మంచినీళ్లు ఇచ్చాం. కరెంట్ తాగునీరే కాదు.. సాగునీరు రంగంలో కూడా అద్భుతమైన పురోగతి సాధించాం. ఈ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.

రైతుబంధును పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయి. రైతుబీమాను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నాం. చండూరు, చౌటుప్పల్‌ను మున్సిపాలిటీగా మార్చాం. మీ నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి అనాథగా చేశారు. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని డెవలప్‌ చేస్తాను. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ, మండల విషయంలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించే బాధ్యత మాది. రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోయినా.. అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. దండు మల్కాపురంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -