మునుగోడులో బీజేపీ ఓడిపోవడం ఖాయం:బాల్క సుమన్‌

95
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ అన్నారు. నియోజకవర్గంలో డబ్బులు మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రచారానికి వెళ్లిన చోట ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారని అన్నారు. చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో కాషాయ పార్టీకి స్పందన కరువైందన్నారు. దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజీపీ కుట్ర పన్ని కారు గుర్తు పోలిన గుర్తును ఈవీఎంలో చేర్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై బీజేపీ కక్ష సాధిస్తున్నదని చెప్పారు. విభజన చట్టం హామీలను బీజేపీ అమలు చేయడంలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా కిషన్‌రెడ్డి పారిపోయాడని విమర్శించారు. కేంద్రంలో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించాలన్నారు.

సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ పెట్టగానే బీజేపీ వాళ్ల కాళ్ల కింద మట్టి కదులుతున్నదని, పీఠాలు వణుకుతున్నాయని పేర్కొన్నారు. అందుకే మునుగోడులో కుట్ర చేసి ఉపఎన్నిక తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్‌ను కట్టడి చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నాయకులు మునుగోడుకు ఏంచేశారో చెప్పి ఓట్లు అడగాలని హితవుపలికారు. ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. బీజేపీ నాయకులు విచ్చలవిడిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, వాటిపై ఈసీ దృష్టి పెట్టాలని కోరారు.

- Advertisement -