తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల వ్యవహార శైలి ఎప్పటికప్పుడు పోలిటికల్ హిట్ ను పెంచుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ చైర్మెన్ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టినది మొదలుకొని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలకు పొసగడం లేదు. దాంతో పార్టీ వ్యవహారాలలో సీనియర్ నేతలు అంటిఅంటనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం మునుగోడు ఎన్నికల నేపథ్యంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటివరకూ మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు.
దాంతో ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడతారనే వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఆ వార్తలను వెంకటరెడ్డి కొట్టిపారేస్తూ వచ్చినప్పటికి ఆయన వ్యవహార శైలి మాత్రం కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఉంటూ వచ్చింది. మునుగుడు ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని, వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ మద్య పార్టీలో తీవ్ర కల్లోలమే సృష్టించాయి. పార్టీలో ఉంటే విధేయతతో ఉండాలని లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని కోమటిరెడ్డి పై బహిరంగంగానే ఇతర కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత పార్టీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. అవన్ని కూడా చకచకా జరిగిపోయాయి.
ఇక రాహుల్ జోడో యాత్రకు కూడా వెంకటరెడ్డి హాజరు కాకపోవడం మరింత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ కు తీవ్ర తలనొప్పిగా మారిందనేది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఆయన పార్టీలో కొనసాగుతున్నప్పటికి.. ఆయన చూపు ఇతర పార్టీల వైపే ఉందనేది ఇంటర్నల్ గా నడుస్తున్న చర్చ. వెంకటరెడ్డి కూడా ఆయన తమ్ముడి లాగా బీజేపీలో చేరతారని ఎప్పటినుంచే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడితో భేటీ కావడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైనే చర్చించానని, రాజకీయ పరంగా ఎలాంటి చర్చలు జరగలేదని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. మూసి ప్రక్షాళన, హైదరబాద్ విజయవాడ హైవే.. వంటి తదితర అంశాలపైనే మోడీతో చర్చించినట్లు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికి ఈ బేటీలో రాజకీయ కోణం కూడా ఉందనే వార్తలు మాత్రం వినిపిస్తునే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…