కోల్‌కతా…పరీక్ష కోసం గ్రీన్ కారిడార్

22
- Advertisement -

అత్యవసర సమయంలో రహదారిని క్లీన్ చేయడానికి అధికారులు సిద్ధమవుతారు. ముఖ్యంగా అవయవాల తరలింపు కోసం కూడా ఈ విధంగా చేస్తారు. దివంగత టీడీపీ నేత తారకరత్నను బెంగూళురులోని హృదయాలయ ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేశారు. దీన్నే గ్రీన్ కారిడార్‌ అంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కోల్‌కత్తాలో కూడా జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఓ విద్యార్థిని పరీక్ష కోసం గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు.

కోల్‌కతాలోని ఔరా వంతెన సమీపంలో బిజీ రోడ్డు వద్ద ఓ విద్యార్థిని పాఠశాల యూనిఫాంలో ఉంది ఆమె కళ్లలో నుంచి నీరు ఉబికివస్తోంది. అటుగా వెళ్తున్న పలువురిని సాయం చేయాల్సిందిగా కోరుతుంది. కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ఈ దృశ్యాలను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ సౌవిక్ చక్రవర్తి గమనించారు. సమస్య ఎంటో అడిగి తెలుసుకుందామని ఆమె వద్దకు వెళ్లారు. ఎందుకు ఏడుస్తున్నావని ఆ విద్యార్థిని ప్రశ్నించగా..తాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని శాయంబజార్‌లోని ఆదర్శ్‌శిక్ష నికేతన్ పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి సాయం చేయాలని కోరింది. మీ కుటుంబ సభ్యులు తోడు రాలేదా అని అడగ్గా…తన తాత చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లనట్లు తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ ఆ విద్యార్థినిని తన అధికారిక వాహనంలో ఎక్కించుకొని…పరీక్షా కేంద్రం వరకు గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోల్‌కు చకచకా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11.30 సమయానికల్లా విద్యార్థినిని పరీక్ష కేంద్రం వద్ద విడిచిపెట్టారు. దీంతో ఆమె పరీక్ష హాలుకు సకాలంలో చేరి పరీక్ష రాసేసింది.

ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ స్పందిస్తూ…నా కూతురు 11వ తరగతి చదువుతోంది. అందుకే ఓ విద్యార్థిని పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. ఆమెను అధికార వాహనంలో కాకుండా మరో వాహనంలో పంపించవచ్చు కానీ పరీక్ష రాసేది కాదు అని అన్నారు. దీంతో కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి వెంటనే గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశామన్నారు. మేము బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆ విద్యార్థిని చాలా ఆందోళన చెందుతోంది. ఏం పర్లేదు. ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చానని వివరించారు.

ఇవి కూడా చదవండి…

వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచే ‘వక్రాసనం’!

విరోచనాలకు.. ఇలా చెక్ పెట్టండి!

హాయిగా నిద్ర పోవడానికి.. మంచి చిట్కాలు!

- Advertisement -