తాను ఏపీ గవర్నర్‌గా వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. తనకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తిలేదని లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని తెలిపారు.
గురువారం పుదుచ్చేరిలోని తట్టాంచావడిలోని ఆది ద్రావిడర్ సంక్షేమ కార్యాలయాన్ని పరిశీలించిన కిరణ్ బేడీ తాను ఏపీ గవర్నర్‌గా వస్తున్న వార్తలు పుకార్లేనని కొట్టిపారేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తాను సంతృప్తిగా ఉన్నానని పరిపాలనా వ్యవహారాల్లో ఉండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు.
2009 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ రెండింటికీ నరసింహనే గవర్నర్‌గా కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీకి గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించనున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను ఏపీ గవర్నర్‌గా వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పడంతో రూమర్స్‌కు తెరపడినట్లైంది.