రివ్యూ : ఖైదీ నెంబర్ 150

125
Khaidi no 150 Review

తొమ్మిది సంవత్సరాల తర్వాత ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌ పై ఖైదీ నెంబర్ 150తో అలరించడానికి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కిన ఖైదీ సంక్రాంతి బరిలో దూసుకొచ్చింది. విడుదలకు ముందే సాంగ్స్‌..టీజర్‌…ప్రీ రీలిజ్‌ ఫంక్షన్‌తో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఖైదీ నెంబర్ 150. డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి…తొమ్మిది సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అదే రేంజ్ పర్ఫామెన్స్‌ కనబర్చాడా..? మెగా అభిమానులకు పండగనిచ్చిందా..? సెకండ్‌ ఇన్నింగ్స్ బాస్‌కు కలిసివచ్చిందా లేదా చూద్దాం…

కథ:

త‌మిళ క‌త్తి సినిమా సీన్ టు సీన్ దించేశారు. కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. తర్వాత జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. ఈ క్రమంలో తనలా ఉన్న వ్యక్తి శంకర్‌(చిరంజీవి)పై హత్యాయత్నం జరగటం.. అతన్ని కాపాడి కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.

Khaidi no 150 Review

కట్ చేస్తే పోలీసులు శంక‌ర్‌ను శీను అనుకుని తీసుకువెళ్లి జైళ్లో పెడ‌తారు. ఈ క్ర‌మంలో అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో ల‌క్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు శీను. త‌ర్వాత నీరూరు రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం పోరాడటానికి సిద్ధమవుతాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? ఫైన‌ల్‌గా శీను కార్పొరేట్ శ‌క్తుల భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? రైతుల స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేందుకు శీను ఏం చేశాడు ? అన్నదే ఖైదీ నెంబర్ 150.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మెగాస్టార్ చిరంజీవి,కథ, కథనం,పాటలు,డ్యాన్స్,ఆకట్టుకునే సన్నివేశాలు. తొమ్మిదేళ్ల త‌ర్వాత వెండితెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరు త‌న‌లో యాక్టింగ్ స్టామినా, ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇటు మాస్ క‌త్తి శ్రీను రోల్‌లో దొంగ‌గా, అటు క్లాస్ శంక‌ర్ రోల్‌లో రైతుల కోసం పాటు ప‌డే వ్య‌క్తిగా మెగాస్టార్ పాత్రలకు ప్రాణం పోశాడు. ఇక చిరు మార్క్‌ డ్యాన్స్‌,డైలాగ్‌లు సినిమాకే హైలెట్. బాస్ ఈజ్ బ్యాక్‌ అంటూ మరోసారి వీణ స్టెప్పుతో అభిమానులతో థియేటర్‌లో స్టెప్పులు వేయించాడు. ‘అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ’ పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. ‘రత్తాలూ..’ ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో’ పాటలు హుషారెక్కిస్తాయి.జ‌డ్జిగా నాగ‌బాబు చిన్న పాత్ర‌లో క‌నిపించి ఫ్యాన్స్‌ను అలరిస్తాడు. రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ అదిరిపోయాయి. కాజల్ పర్వాలేదని పించింది. బ్రహ్మానందం, పోసాని,అలీ, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

Khaidi no 150 Review

మైనస్ పాయింట్స్‌:

బలమైన విలన్ పాత్ర లేకపోవటం సినిమాకు మైనస్ పాయింట్.వినాయ‌క్ మార్క్ మ్యాజిక్ మిస్సైనట్లు అనిపిస్తుంది. ఇక బ్రహ్మానందం కామెడీ పెద్దగా పేలలేదు.ఎలాంటి రిస్క్‌ లేకుండా కత్తిన మక్కికి మక్కి దించేశాడు వినాయక్‌. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో కూడా ఎమోషన్ కాస్త తగ్గింది.

సాంకేతిక విభాగం:

దర్శకుడిగా వి.వి. వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి ఎఫ‌ర్ట్ పెట్టాయి. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీలో లాంగ్‌, క్లోజ‌ప్ షార్ట్స్ అన్ని బాగున్నాయి. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్‌ సినిమాకే హైలెట్. పాట‌లు తెర‌మీద కూడా మాస్‌కు మంచి కిక్ ఇస్తాయి. గౌతంరాజు ఎడిటింగ్‌ బాగుంది. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, క‌ణ్ణ‌న్ ఫైట్స్ త‌మిళ క‌త్తి సీన్ల‌ను మ‌క్కీ దించేశారు. ప‌రుచూరి-వేమారెడ్డి-బుర్రా సాయిమాధ‌వ్ లాంటి ముగ్గురు రైట‌ర్ల క‌లిసి ప‌నిచేశారంటే డైలాగులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. తొలి సినిమానే ఐనా నిర్మాతగా రాంచరణ్‌కి వంద మార్కులు పడ్డాయి.

తీర్పు:

మెగాస్టార్ ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా మెగా అభిమానుల్లో మంచి జోష్ నింపింది. చిరులో ఎన‌ర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మంచి సందేశం ఉన్న క‌థ‌ కావ‌డం, చిరు యాక్టింగ్‌తో సంక్రాంతికి మంచి ఓపెనింగ్‌తో ముందుకు వచ్చింది. వన్ మాన్ షో గా చిరు పర్ ఫార్మెన్స్ ఉంటే దీనికి తోడు కాజల్ అందాల ప్రదర్శన సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా మెగాస్టార్ చెప్పినట్లుగా సంక్రాంతికి మంచి ఎంటర్ టైన్‌ మెంట్ తో పాటు ఫుల్ మీల్స్ భోజనం ఖైదీ నెంబర్ 150.

విడుదల తేదీ:11/01/2017
రేటింగ్: 3.5/5
నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
దర్శకత్వం: వి.వి.వినాయక్‌