సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఒక వైపున ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతోను ..మరో వైపున ఏఎన్నార్ సాంఘిక చిత్రాలతోను అదరగొట్టేస్తోన్న కాలంలో, జానపద కథా చిత్రాలతో కాంతారావు తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. పౌరాణిక .. చారిత్రక .. సాంఘిక చిత్రాలలోను ఎన్నో కీలకమైన పాత్రలను పోషించారు. అలాంటి కాంతారావు .. నిర్మాతగా నష్టాలు చవి చూసి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఆయితే కాంతారావు బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కత్తివీరుడు కాంతారావు బయోపిక్‌కు ప్రముఖ సినీ దర్శకుడు పీసీ ఆదిత్య శ్రీకారం చుట్టారు. కాంతారావు స్వగ్రామం సూర్యాపేట జిల్లా గుడిబండను ఆయన సందర్శించారు. కాంతారావు నివసించిన ఇంటిని పరిశీలించారు. కాంతారావు సమకాలికులతో ముచ్చటించి, పలు అంశాలను సేకరించారు. 250చిత్రాల్లో నటించిన ఆయన 100చిత్రాల్లో హీరోగా చేశారు.
ఆయన బయోపిక్ తీయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆదిత్య తెలిపారు. ఆయన జీవిత చరిత్ర సినిమాకు అనగనగా ఓ రాకుమారుడు అనే పేరు నిర్ణయించిన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే ముహుర్తాన్ని నిర్ణయించి ఆయన వర్ధంతి వచ్చే ఏడాది మార్చి 22న సినిమాను పూర్తిచేసి ప్రేక్షకులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.