‘ఇండియన్ 2’పై కమల్ క్లారిటీ..

51
Kamal Haasan

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఆమధ్య మొదలైయ్యాయి. కమల్, కాజల్ జంటగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగి కొందరు టెక్నీషియన్లు మరణించడం.. తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత ఇక షూటింగ్ మొదలవుతుందనగా చిత్ర నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదం చెలరేగి వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. దర్శక, నిర్మాతలను సామరస్యంగా పరిష్కరించుకోమంటూ కోర్టు సూచించింది. అయితే, ఇంతవరకు ఇది పరిష్కారం కాలేదు. ప్రాజక్టు మధ్యలోనే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో కమల్‌ తాజాగా, ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ‘ఇండియన్‌-2’ చిత్రం షూటింగ్‌, వివాదాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రానికి సంబంధించిన అవాంతరాలు 60 శాతం మేర పరిష్కారమయ్యాయని, అలాగే, చిత్ర నిర్మాణ సంస్థకు దర్శకుడికి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంతో రూపొందుతున్న ‘విక్రమ్‌’ పూర్తయిన వెంటనే ‘ఇండియన్‌-2’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతుందని కమల్‌హాసన్‌ వెల్లడించారు.