తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు కమల్,రజనీ కాంత్. వీరిద్దరి పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా రోజుకోవార్త రాజకీయవర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. బాలచంద్రుని శిష్యులుగా ఇండస్ట్రీకి వచ్చినా.. వేర్వేరు భావజాలం కలిగిన వ్యక్తులు కావడంతో రజనీ, కమల్ సొంత పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.
అయితే రజనీ వెయిట్ అండ్ సి పాలసీతో ఉంటే కమల్ మాత్రం వీలైనంత త్వరలో తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసి పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసిన ప్రతిసారి రాజకీయ వర్గాల్లో ఉహాగానాలు జోరందుకుంటున్నాయి.
త్వరలోనే వీరిద్దరూ ఒకే వేదికపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్ర ఆడియో వేడుక అక్టోబర్ 27న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. ఈ ఆడియో వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తమిళ వర్గాల సమాచారం.
ఇందుకోసం దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా బృందం కమల్‌ను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కమల్ ప్రస్తుతం బిజీగా ఉండడంతో వేడుకకు వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఆడియో వేడకకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకలో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ 25 నిమిషాల పాటు లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.