క్యాస్టింగ్ కౌచ్ అంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది సినీనటి,సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జీవిత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.. చేతులకి గాజులుతొడుక్కుని కూర్చోలేదు. ఆ విషయం తెలుసుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల ముందు తాను మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్ చూశానని, సామాజిక కార్యకర్త సంధ్య ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై నీచమైన ఆరోపణలు చేశారని అన్నారు.తాను హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని ఆరోపణలు చేసిందని మండిపడింది. సంధ్య మహిళల కోసం పోరాడుతుందని అందరూ అంటారని, సంధ్య కూడా ఒక మహిళ అని, అటువంటి ఆమె ఇంత దారుణంగా ఎలా ఆరోపణలు చేస్తుందని జీవిత ప్రశ్నించారు. సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గురాలిని కాదని జీవిత తెలిపింది.
టీవీల్లో కాస్టింగ్ కౌచ్‌పై చర్చలు జరుగుతుంటే చాలా అసహ్యంగా, ఛీప్‌గా అనిపించిందని, తనను మాట్లాడడానికి రమ్మని పిలిచినా వెళ్లలేదని తెలిపింది. శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? సినిమాలో పాత్రలు ఎలా ఇస్తారు? ఒక సినిమా తీయాలంటే ఎంతగా ఖర్చు చేయాలో, ఎంతగా కష్టపడాలో నాకు తెలుసని తెలిపింది. ఎటువంటి ఆర్టిస్టులను తమ సినిమాల్లో పెట్టుకోవాలో ప్రొడ్యూసర్లు, దర్శకులు ఎంతగానో ఆలోచిస్తారని… ఒకవేళ సినిమాకి నష్టం వస్తే ఎవరు భరిస్తారని ప్రశ్నించింది.
పవన్‌కల్యాణ్‌గారిపై ఆరోపణలు చేస్తే అభిమానులు తీవ్రంగా స్పందించారు. జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేస్తే ఎవరూ స్పందించరని అనుకుంటున్నారా? ఎవరూ చూస్తూ ఊరుకోరు. మా గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారని మండిపడింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. త్వరలోనే పరువునష్టం దావా వేస్తా. ఎవరినీ వదిలి పెట్టనని స్పష్టం చేసింది జీవిత.