సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జేడీతో మంత్రి గంటా శ్రీనివాసరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరాలని ఆహ్వానించడంతో పాటు విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయాలని జేడీని కోరారు గంటా.
టీడీపీ నేతల ప్రతిపాదనకు జేడీ ఓకే చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానిన ప్రకటించిన జేడీ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలతో భేటీ అవ్వడంతో ఆయన పసుపు కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది.
తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్‌గా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సత్యం కుంభకోణం ,జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక కేసులను ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా పరుగులు పెట్టించారు. అనంతరం తన సర్వీస్‌కు స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేడీ … బీజేపీ, జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినా చివరికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.