సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తెరుకోకముందే టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి గట్టిపట్టున్న అనంతపురం జిల్లాలో టీడీపీ కాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ జాతీయ నేత రాంమాధవ్..అనంత టీడీపీ నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీడీపీ సీనియర్ నేతలు జేసీ బ్రదర్స్‌తో పాటు పరిటాల ఫ్యామిలీ,మాజీ ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాంమాధవ్ ఇచ్చిన హామీ మేరకు వారు కాషాయ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అనంతపురం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీకి వ్యతిరేక గాలి వీచిన సందర్భంలోనూ ఈ జిల్లాలో గణనీయమైన స్ధానాలు దక్కించుకున్న సందర్భాలున్నాయి. కానీ గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటకు బీటలు వారాయి. జిల్లాలోని రెండు ఎంపీ స్ధానాలు కొల్పోగా 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
దీంతో టీడీపీ నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే వీరంతా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. సుదీర్ఘకాలం టీడీపీలో పరటాల ఫ్యామిలీ కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి చేరిక లాంఛనమే అయితే త్వరలోనే మరికొంతమంది సీనియర్ నేతలు టీడీపీని వీడే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.