తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రోజు రాత్రి 11.30నిమిషాలకు కన్నుమూశారు. ద్రవిడ, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ కన్నుమూతతో యావత్‌దేశం శోకసంద్రమైంది. తమిళ ప్రజల గుండెలు ఆవేదనతో అల్లాడుతున్నాయి. అమ్మగా అండగా వుంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంట నీరును తుడిచిన ఆ అమృత హస్తాలు ఇక లేవన్న వార్తను తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే అమ్మమరణ అనంతరం ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది… చెన్నైలోని ఓ ప్రముఖ దుకాణం తమ ఖాతాదారులకు ఇచ్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో 2016 దినసరి క్యాలెండర్‌ను ముద్రించింది. ఒక్కో తేదీ చీటిపై ఓ సూక్తిని లేదా తాత్వికతతో ముడిపడిన వాక్యాలను తమిళంలో ముద్రించారు. డిసెంబరు 5వ తేదీ చీటిపై..‘ఓ గదిలో మరణం – పక్క గదిలో వారసత్వం కోసం కొట్లాట’ అని అర్థాన్ని సూచించే వాక్యాలను ఆ తమిళ క్యాలెండర్‌లో లో ముద్రించారు. ఇప్పుడు ఇదే తమిళనాడులో కలకలం రేపుతోంది. 5వ తేదీ సాయంత్రం అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురై మృత్యువుకు చేరువలో ఉన్నారు.
అదే సమయంలో పక్కనే ఉన్న గదిలో ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం నాయకత్వంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అయ్యి, అమ్మ వారసుడు కొత్త సీఎం కోసం మంతనాలు జరిపారు. టీవి ఛానలల్లో ఈ వార్త వెలువడగానే అప్పటిదాకా ఈ క్యాలెండర్ చీటి గురించి పెద్దగా పట్టించుకోని వారంతా ఒక్కసారిగా దానిపై దృష్టిపెట్టారు. క్యాలెండర్ వాక్యాలు నిజమయ్యాయంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ క్యాలెండర్ చిటీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
దాదాపు పదిహేను సంవత్సరాలు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. తమిళుల పాలిట అమ్మ అయ్యారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న జయలలిత.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. వరసగా రెండో సారి సీఎం పదవిని చేపట్టడం ఒక సంచలనమే.