తృణమూల్‌ తరఫున జయాబచ్చన్‌ ప్రచారం

156
Jaya Bachchan
- Advertisement -

బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారనుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారబరిలోకి జయాబచ్చన్ దిగుతోంది. సోమవారం నుండి తృణమూల్ పార్టీ తరపున ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో ‘బెంగాల్‌ ప్రజలకు వారి సొంత కూతురే కావాలి. బయటి వ్యక్తులు వద్దు’ అంటూ తృణమూల్‌ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే తన పుట్టింటి రాజకీయాల వైపు ఆసక్తిగా గమనిస్తున్న ఆమె అదను చూసి ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు.

బెంగాల్‌ జయాబచ్చన్‌ పుట్టిల్లు. ఆమె జబల్‌పూర్‌లోనే పుట్టి పెరిగారు. సినిమాల్లోకి ప్రవేశించి కీర్తి ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను పెళ్లాడారు. అందుకే బిగ్‌బీని బెంగాల్‌ అల్లుడిగా సంబోధిస్తుంటారు. మరి బెంగాల్‌ బిడ్డ అయిన జయా ప్రచారం వారి గెలుపునకు దోహదం చేస్తుందని తృణమూల్‌ భావిస్తోంది.

టోలీగంజ్‌ ఎమ్మెల్యే అరూప్‌ బిశ్వాస్‌ తరఫున ఆమె ఈరోజు ప్రచారం చేయనున్నారు. అక్కడ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో పోటీ చేస్తున్నారు. తృణమూల్‌ ప్రకటించిన ప్రచార స్టార్ క్యాంపెయినర్‌ల్లో జయాబచ్చన్‌ కూడా ఉన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఇప్పటికే మమతకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

- Advertisement -