కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారని, అందుకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రకమైన వార్తలను ఆయన మొదటి నుంచి కూడా ఖండిస్తూనే ఉన్నారు. అయినప్పటికి ఇలాంటి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ఈ మద్య ఆయనకు బిఆర్ఎస్ లో సీట్ కన్ఫర్మ్ అయిందని త్వరలోనే ఆయన బిఆర్ఎస్ గూటికి చేరుతారనే పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తాజాగా మరోసారి ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
ఈ రకమైన వార్తలు వస్తుంటే.. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఎందుకు స్పందించడం లేదని టి కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ లోనే ఒక విభాగం ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైన వదంతులను పుట్టిస్తోమని ఇలాంటి సంస్కృతి గతంలో టిడిపిలో ఉండేదని ప్రస్తుతం అది కాంగ్రెస్ కు పాకిందని ఘాటుగా స్పందిచారాయన. దీన్ని బట్టి చూస్తే జగ్గారెడ్డిని కాంగ్రెస్ నుంచి బయటకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అనే అనుమానాలను జగ్గారెడ్డి వర్గం వ్యక్తం చేస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా జగ్గరెడ్డికి మంచి పేరుంది. కానీ గత కొన్నాళ్లుగా ఆయన పేరు పార్టీలో పెద్దగా వినిపించడం లేదు. పైగా ఇటీవల టి కాంగ్రెస్ ఏర్పరచిన కమిటీలలోనూ, ఆయా పదవులలోనూ జగ్గారెడ్డి పేరు అసలు కనిపించలేదు. దీంతో అసహనంగా ఉన్న ఆయన పార్టీ మారతారనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రజెంట్ ఆయన ఇచ్చిన క్లారిటీతో జగ్గారెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదనే విషయం స్పష్టమైంది.
Also Read:ఉలవలతో ఎన్ని ప్రయోజనాలో!