తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్‌..

196
- Advertisement -

డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు కబడ్డీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కొరియా.. భారత్‌ను ఓడించి ప్రకంపనలు సృష్టించింది. కొరియా.. భారత్‌పై గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. 32-34తో కొరియా చేతిలో భారత్‌ అనూహ్యంగా ఓడిపోయింది. మ్యాచ్‌లో ఎక్కువ శాతం స్టార్ రైడర్ అనూప్ కుమార్ సారథ్యంలోని టీమ్‌ఇండియాదే ఆధిపత్యమైనా..ఆఖర్లో కొరియా మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకుంది. ముఖ్యంగా ప్రో కబడ్డీ లీగ్‌లో సత్తాచాటిన స్టార్ జాంగ్‌కున్‌లీ పాయింట్లు కొల్లగొట్టడంలో కొరియాకు కీలకమయ్యాడు.

ఫస్టాఫ్‌ ముగిసేసరికి భారత్ 18-13తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ద్వితీయార్ధంలో కొరియా అద్భుతంగా పుంజుకుంది. భారత్‌ను ఆలౌట్‌ చేసి 26-29తో నిలిచిన కొరియా ఆ తర్వాత అంతరాన్ని తగ్గించుకుంటూపోయింది. ఆ తర్వాత జన్‌ కున్‌ లీ రైడ్‌ పాయింట్లు తేవడంతో 31-31తో స్కోరు సమం చేసింది. ఈ స్థితిలో రైడ్‌కు వచ్చిన దీపక్‌ హూడాను కొరియా పట్టేయడంతో ఆ జట్టు 33-31తో విజయానికి చేరువైంది. ఆ తర్వాత జన్‌ కున్‌ లీ మరో సూపర్‌ రైడ్‌ చేయడంతో కొరియా 34-32తో విజయాన్ని సొంతం చేసుకుంది.

Kabaddi World Cup-2016

ఇరాన్ ఘన బోణీ: ప్రపంచకప్ కబడ్డీలో ఇరాన్ ఘన బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇరాన్ 52-15తో మెగా టోర్నీలో తొలిసారి ఆడుతున్న అమెరికాపై భారీ విజయం సాధించింది. అమెరికా ఆటగాళ్ల అనుభవలేమిని వాడుకుంటూ ఇరాన్ వరుస పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

kabaddi

- Advertisement -