దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో,కరోనా రోగుల సంఖ్య నానాటికీ రెట్టింపవుతోంది.దీంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆసుపత్రులలో బెడ్ల కొరత,ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఆక్సిజన్ లభ్యత లేక కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రత్యేకంగా ప్రాణవాయువు తరలింపు కోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపాలని కేంద్రం రైల్వే శాఖను కోరింది. ద్రవరూప ఆక్సిజన్ ను రైళ్ల ద్వారా తరలించే వెసులుబాటు ఉంటే వెంటనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో రైల్వే శాఖ పలు మార్గాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో ట్రయల్ రన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపాలని నిర్ణయించారు.ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ఎలాంటి ఆటంకాలు, నిలుపుదలలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారోలను లోడ్ చేయడానికి ఖాలీ ట్యాంకర్లను ముంబై సమీపంలోని కలంబోలి, బోయిసర్ రైల్వే స్టెషన్ల నుంచి రైళ్ళు సోమవారం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించవచ్చా అనే విషయంలో గతంలోనే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖను ఆశ్రయించాయని తెలిపారు.