పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 441 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్ ఏదశలోనూ గెలుపుకోసం ప్రయత్నించలేదు. దీంతో 33.5 ఓవర్లలో 107 పరుగులకే చాపచుట్టేయడంతో 333 పరుగుల భారీ తేడాతో ఆసీస్ గెలుపొందింది. బ్యాటింగ్,బౌలింగ్ అన్ని రంగాల్లో ఆదపత్యం ప్రదర్శించిన ఆసీస్ ..కోహ్లీ సేనకు చుక్కలు చూపించింది. ఒక్క పుజారా మినహా భారత బ్యాట్స్ మెన్ ఎవరు కనీసం ప్రతిఘటించలేక పోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేసిన ఓకీఫె రెండో ఇన్నింగ్స్‌లో అదే జోరు కంటిన్యూ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 6 వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. ఓకీఫె కితోడుగా లయన్ 4 వికెట్లు తీయడంతో మరో రెండు రోజులు మిగిలి ఉండగానే భారత్ ఓటమి పరిపూర్ణమైంది. దీంతో భారత్ వరుస 14 టెస్టు విజయాలకు బ్రేక్ పడింది.
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 143/4తో ఆట ప్రారంభించిన ఆసీస్ 285 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(109 పరుగులు) అద్భుత శతకంతో భారత్ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించాడు. స్మిత్‌తోపాటు, రెన్‌షా (31), మిచెల్ మార్ష్(31), వేడ్ (20), స్టార్క్(30), హ్యాండ్‌స్కోబ్(19), లియోన్ (13), ఓకీఫె (6) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, జడేజా 3, ఉమేశ్ యాదవ్ 2, జయంత్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్105 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
బౌన్సీ పిచ్ పై ఎన్నో అంచనాలతో బౌలింగ్ కు దిగిన భారత జట్టు అంచనాల మేరకు రాణించలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు టీమిండియా ఫీల్డింగ్ లోపాలు, జారవిడిచిన క్యాచ్ లు జట్టుకు భారంగా మారాయి. దీంతో సొంతగడ్డపై భారత్‌కు పరాభవం తప్పలేదు.