దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పై కేసులు నమోదౌతున్నాయి.. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటీ 10 లక్షలకు చేరువయ్యింది.
దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14,264 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,667 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,91,651కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 90 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,302 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,89,715 మంది కోలుకున్నారు. 1,45,634 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,10,85,173 మందికి వ్యాక్సిన్ వేశారు.