ధాన్య సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంః మంత్రి నిరంజన్ రెడ్డి

371
Niranjan Reddy
- Advertisement -

తెలంగాణ పౌరసరాఫరాల శాఖ మరో రికార్డు సృష్టించింది. రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించింది. రూ. 13,675 కోట్ల విలువ చేసే 77.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 14.73 లక్షల మంది రైతుల నుండి కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదీ అత్యధికంగా చెప్పుకోవచ్చు.. కనీస మద్దతు ధర (గ్రేడ్‌-ఎ క్వింటాల్‌కు రూ. 1770, సాధారణ రకం – క్వింటాల్‌కు రూ.1750)కు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాలోకి నేరుగా జమ చేసింది.

ఖరీఫ్‌లో 8,09,885 మంది రైతుల నుండి 3297 కొనుగోలు కేంద్రాల ద్వారా 40.41 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 6,63,723 మంది రైతుల నుండి 3509 కొనుగోలు కేంద్రాల ద్వారా 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ తరువాత దేశంలోనే రెండవ స్థానంలో నిలించింది. ఖరీఫ్‌, యాసంగిలో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 6816 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 14,73,608 మంది రైతుల నుండి 77.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 2017-18లో 53.98 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 23.43 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా కొనుగోలు చేసింది.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు పెరిగాయని.. ఇందుకు అనుగుణంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ఖచ్చితంగా మద్దతు ధర లభిస్తుందనే నమ్మకంతో రైతులు ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తున్నారని చెప్పారు.

- Advertisement -