పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రైవేట్ బ్యాంక్ అధికారులకు హడలుపుట్టిస్తోంది. ఈ కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది. అయితే ఈ క్రమంలోనే టాప్ ప్రైవేట్ బ్యాంక్ అధికారులకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చార్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ షిక్కా శర్మలకు తాజాగా సమన్లు జారీ చేసింది సీబీఐ.
అయితే నీరవ్ మోదీతో ఎలాంటి సంబంధం లేదని కేవలం గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. కానీ ఎంత అప్పు ఇచ్చింది మాత్రం వెల్లడించలేదు.
కాగా..యాక్సిస్ బ్యాంక్ కూడా గీతాంజలి గ్రూప్‌కు భారీగా రుణమిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు కూడా ఈ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ విపుల్ చిటిలియాను సీబీఐ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. పీఎన్‌బీ స్కాంపై ఆయనను ప్రశ్నిస్తోంది.
ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేసింది సీబీఐ. ఇదిలా ఉండగా..వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టి పరారీలో ఉన్నారు.