మందుబాబులకు Sతో చెక్‌

244
Hyderabad police impose restrictions for New Year celebrations
- Advertisement -

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతు….కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు గ్రేటర్ హైదరాబాద్ సిద్దమవుతోంది. పసందైన విందును ఆరగిస్తూ, ఇష్టమైన సెలబ్రిటీల సమక్షంలో అర్ధరాత్రి వేళ ఆనందంగా వేడుక చేసుకునేందుకు పలు ప్యాకేజీలతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు రెడీ అవుతున్నాయి.  మీరు రావడమే ఆలస్యం..హోరెత్తించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ పలు రెస్టారెంట్‌లు,రిసార్ట్‌లు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. . డిసెంబరు 31 రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1గంట వరకు కిక్కెక్కించే బీరు, లిక్కర్, డీజేలతో ఎంజాయ్ చేయండంటూ ఆహ్వానం పలుకుతున్నాయి.

ఓవైపు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లు ఆహ్వానం పలుకుతున్న మందుబాబుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. హైద‌రాబాద్‌లో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు.  డ్ర‌గ్స్‌, హుక్కాపై ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు…ఎలాంటి కార్య‌క్ర‌మానికైనా అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేశారు.

Hyderabad police impose restrictions for New Year celebrations
ఇక వాహనాలను వేగంగా నడుపుతూ వచ్చి ప్రమాదానికి గురయ్యే 22 ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంకన్‌ డ్రైవ్ చేపట్టారు. రేడియం స్టిక్లర్లు, బారికేడ్ల సహాయంతో ఎస్ అక్షరం ఆకారంలో మలుపులను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనం దాన్ని దాటి పోవాల్సిందే. అంతేకాదు మరో 18 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు  పోలీసులు తెలిపారు.

దీంతో పాటు డిసెంబరు 31 రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు ఓఆర్‌ఆర్ పై అన్ని తేలికపాటి వాహనాలు( జీపులు, కార్లు)కు అనుమతి లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాల డ్రైవర్‌లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించిన తర్వాతనే అనుమతిస్తారు. న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని… ఈవెంట్‌కు వచ్చిన వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ఈవెంట్ నిర్వహకులదేనని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -