ప్రస్తుతం సోషల్ మీడియా అనేది చాలామంది దైనందన జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా సైట్లు వ్యక్తుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు, విద్యార్థులు ఈ సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సంస్థల్లో భవిష్యత్ బాగుంటుంది? మీరు ఎంచుకున్న ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఏమిటి? ఒక సంస్థలో ఖాళీలను ఎలా భర్తీ చేస్తారు? లాంటి విషయాలు తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు మంచి వేదికగా ఉపయోగపడతాయి.
ఒకప్పటిలాగ పేపర్లలోనూ, మ్యాగజైన్లలోనూ వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్ల ఆధారంగా ఉద్యోగాలను వెతికి పట్టుకునే విధానానికి కాలం చెల్లి చాలాకాలమే అయింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సరైన సాధానాలను కనుగొని, వాటిద్వారా ఉద్యోగాలను ఒడిసి పట్టక పోతే ఆనక చింతించీ ప్రయోజనముండదు. ఉద్యోగార్థులు మంచి ఉద్యోగం సాధించడంలో, సంస్థలు నైపుణ్యం ఉన్న ఉద్యోగిని ఎంపిక చేసుకోవడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి… మరీ అలాంటి సమయంలో మీరు చేసే కామెంట్లు, మీరు షేర్ చేసే పోస్టులు మీ ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
మొదటగా మీ రెజ్యూమెని గూగుల్ వెతికితే మీకు సంబంధించి ఎలాంటి వివరాలు వస్తాయో ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరమైన ఫోటోలు.. పోస్టులు ఉంటే వెంటనే తీసేయండి. మీకు సంబంధించిన సమాచారం సరైన విధంగా పెట్టుకోండి. అన్ని చోట్ల(ఫేస్‌బుక్, ట్విటర్, లింక్డ్‌ఇన్‌లో) ఒకేలా ఉండేలా చూసుకోండి. మీకు ఉద్యోగం రావాలంటే మీ ఆటీట్యూడ్ మార్చుకోవాల్సిందే.
అలాగే మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి సంబంధించిన సహచరులెవరైన ఉంటే వారు ఎలాంటి పోస్టులు చేస్తున్నారో.. పరిశీలించండి. ఇది మీ ప్రొఫైల్‌లో ఉన్న లోపాలను సవరించుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఒక సంస్థ ఎలాంటి లక్షణాలున్న ఉద్యోగి కావాలని కోరుకుంటుందో అవి మీ ప్రొఫైల్‌లో ఉండాలి.
అలాగే సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు మీ క్యారక్టర్‌ను డిసైడ్ చేసేలా ఉండాలి. మీ గౌరవానికి, వృత్తిపరంగా మీ విశ్వసనీయతకు భంగం కలిగించేలా అసలు ఉండకూడదు.
ఫేస్‌బుక్‌లో మీ వ్యక్తిగత సమాచారం అందరికీ తెలిసేలా ఉండకూడదు. మీకు సంబంధించిన వారికి మాత్రమే మీ వ్యక్తిగత విషయాలు చూడగలిగేలా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేస్తే మీ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుంది.