చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అని వ్యాఖ్యానించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది.
తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ అగర్వాల్.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది.
Also Read:రాజేంద్రప్రసాద్ కామెంట్స్‌పై వార్నర్!

