మిర్చికి మద్దతు ధర మిలీనియం జోకన్నారు మంత్రి హరీష్. మిర్చికి మద్దతు ధర రూ. 5వేలు ఇవ్వటం అంటే రైతులకు శఠగోపం పెట్టినట్లే అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి కేంద్రంపై మండిపడ్డారు. మేలు రకం మిర్చి పంటకు కేంద్రం చెప్పిన ధరకన్నా ఎక్కువ రేటే వస్తోందని, మేలు రకమే కొనమని కేంద్ర చెబుతోందని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటన వల్ల రాష్ట్రానికి లాభం లేదని దుయ్యబట్టారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రకటనపై అసంతృప్తితో ఉందన్నారు.
కేవలం 33వేల టన్నుల పంట కొనుగోలు చేస్తే.. మిగతా పంట సంగతి ఏంటని కేంద్రం తీరును ప్రశ్నించారు. మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఫస్ట్ క్వాలిటీనే కొంటాం అని చెప్పటం ఏంటని.. రెండు, మూడో రకం పంటను ఎవరు కొనుగోలు చేయాలనేది చెప్పటం లేదన్నారు. మిర్చి పంటకు కనీస ధర క్వింటా రూ.7వేల రూపాయలుగా నిర్ణయించాలని నెల రోజుల క్రితం లేఖ రాస్తే.. ఇప్పుడు స్పందించారని.. అది కూడా కంటితుడుపు చర్యగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. రెండేళ్ల కిందట కోల్డ్ స్టోరేజీల కోసం ప్రతిపాదన పెట్టామని కానీ కేంద్ర పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాస్తామని హరీష్ పేర్కొన్నారు. స్థానిక బిజెపి నేతలు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఏజెన్సీలే కాకుండా.. FCI, నాఫెడ్ లాంటి సంస్థలను కూడా రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. వెంటనే 50శాతం నిధులు కూడా విడుదల చేయాలన్నారు.