తెలంగాణపై కేంద్రం కుట్ర- గుత్తా సుఖేందర్ రెడ్డి

37

తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా,కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది.. నది జలాలకు సంభందించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అత్యంత దారుణం,దుర్మార్గం అని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన నల్గొండ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. తెలంగాణను ఎడారిగా మార్చాలని కేంద్రం కుట్ర పన్నింది. నిజాం రాజులు కట్టిన మూసి,డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్‌లో పొందుపరచడం ఆశ్చర్యంగా ఉంది. కేంద్రానికి తెలియకుండా ఒక్క చుక్క నీటిని వినియోగించుకునే వీలు లేకుండా కుట్ర చేసింది కేంద్రం.

తెలంగాణ నాయకుల అమాయకత్వాన్నీ అడ్డం పెట్టుకొని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ నాయకుల నోళ్లు మూయించారు అప్పటి ఆంధ్ర పాలకులు. సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను, రన్నింగ్ ప్రాజెక్టు లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక బీజేపీ కుట్ర పన్నింది. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు అని అర్థం అయి ఈ విధంగా కక్ష్య పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలన్నా కేంద్రం దాయాదాక్షిణ్యాల మీద ఆధార పడాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ బాగు కోరే వారు ఎవ్వరు ఈ గెజిట్‌ను ఒప్పుకోరు. బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. బీజేపీ నాయకులను నిలదీయాలి. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణపై ప్రేమ లేదు. అధికారం కోసమే వారి ఆరాటం. కేంద్రం పునరాలోచించాలి. గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలి. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.