గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతోంది. గుజరాత్‌లోని మొత్తం 182 స్థానాల్లో భాజపా ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాల్లో 39 స్థానాల్లో గెలుపుదిశగా దూసుకుపోతోంది.
ఇక దేశ వ్యాప్తంగా అందరి కళ్లు గుజరాత్‌పైనే ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం కావడం, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వెలువడుతున్న ఫలితాలు కావడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కౌంటింగ్ ప్రారంభ సమయంలో కాంగ్రెస్,బీజేపీ హోరా హోరి పోరు కొనసాగగా తర్వాత మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయింది.
అయితే ఇంత ఆనందంలోనూ భాజపాకు కొన్ని జిల్లాల ఓటర్లు ఇచ్చిన తీర్పు షాక్‌కు గురిచేసింది. గుజరాత్‌లోని ఆరు జిల్లాల్లో బీజేపీ అసలు ఖతా తెరవలేదు. అమ్రేలీ, నర్మద, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో అధికార పార్టీ ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేదు.మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నవ్‌సారి, అర్వలి జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఏడు జిల్లాల్లో భాజపా, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి.
మొత్తంగా మోడీ తన సొంతరాష్ట్రంలో బీజేపీని ఆరోసారి అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్‌అయ్యారు. మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన అభివృద్ధికి తార్కణంగా ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు కలగానే మిగిలిపోయాయి.