షర్మిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు..!

202
gone prakash
- Advertisement -

తెలంగాణలో దివంగత నేత వైఎస్ఆర్‌ కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 9 వ తేదీన కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు..వరుసగా తెలంగాణ జిల్లాలలోని వైఎస్ఆర్ అభిమానులతో మీటింగ్‌ పెడుతూ హల్‌చల్ చేస్తోంది. ఆంధ్రాకు చెందిన వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అయిన క్రిస్టియన్లు, రెడ్డి సామాజికవర్గాన్ని దెబ్బకొట్టాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా తన సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో విబేధాలతో తెలంగాణలో పార్టీ పెట్టడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అసలు ముందు ఏపీలో పార్టీ పెట్టాలని షర్మిల డిసైడ్ అయినా…తల్లి విజయమ్మ అడ్డుపడిందంట..అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెడితే నాయిన పరువు పోతుందని, కాకపోతే తెలంగాణలో పార్టీ పెట్టుకో అని విజయమ్మ సలహా ఇచ్చిందంట. అందుకే బెంగళూరు నుంచి హైదరాబాద్‌లో దిగిన షర్మిల నేను తెలంగాణలో పుట్టి పెరిగిన..నేను తెలంగాణ కోడలిని..నాకు తెలంగాణలో పార్టీ పెట్టే హక్కు లేదా అని తనదైన కీచు గొంతుతో ప్రశ్నిస్తోంది. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలను కాదని షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అన్నది అనుమానమే. పైగా తెలంగాణకు, ఏపీకి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పంచాయతీలు చాలానే ఉన్నాయి. పోతిరెడ్డిపాడుపై ఏపీ కడుతున్న రాయలసీయ ఎత్తిపోతల వల్ల దక్షిణ తెలంగాణ దాదాపుగా ఎడారిగా మారుతోంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. మరి పాలమూరులో మా నాయన కట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు..ఇంకా వలసలు అలాగే ఉన్నాయని మొసలి కన్నీరు కారుస్తున్న షర్మిల తన అన్న జగన్‌కు వ్యతిరేకంగా కొట్లాడుతుందా..తెలంగాణ కోసం ఏపీతో కయ్యానికి సిద్ధమవుతుందా..అన్నా, చెల్లెళ్లు కొట్టుకుంటే ఏపీలో టీడీపీకి మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు కదా…కొడుకు జగన్‌ అధికారం కోల్పోయే పరిస్థితికి షర్మిల కారణమైతే విజయమ్మ ఊరుకుంటుందా…అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా..తమకు మద్దతు ఇచ్చే క్రిస్టియన్, రెడ్డి ఓటు బ్యాంకుతో కొన్ని సీట్లు గెలిచి కింగ్ మేకర్ కావాలని షర్మిల ఆశపడుతున్నట్లు ఉంది..అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా 2009లో రాజకీయ శూన్యత లేని సమయంలో రాంగ్ టైమ్‌లో ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. చిరుకున్న క్రేజ్‌తో అన్ని రాజకీయ పార్టీల నేతలు పదవులపై ఆశతో ఆయన పార్టీలో చేరి ఆస్తులు అమ్ముకుని నడిబజారున పడ్డారు. సరిగ్గా షర్మిల కూడా తనకు అవకాశాల్లేని తెలంగాణలో పార్టీ పెడుతూ ఇక్కడి నేతల కొంప ముంచబోతుంది. షర్మిల పార్టీ అధికారంలోకి వస్తే తమకు రాజకీయంగా పెద్ద పదవులు వస్తాయనే నమ్మకంతో కొంత మంది తెలంగాణకు ద్రోహం చేస్తూ ఆమె పంచన చేరుతున్నారు. షర్మిల ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు..ఈ క్రమంలో ఆమె పార్టీని నమ్ముకున్న చాలా మంది అమాయకులు బలైపోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌ ప్రస్తావిస్తూ షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. వైఎస్ కుటుంబంలో కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని అన్నారు. షర్మిలకు జగన్ లోక్‌సభ సీటు, రాజ్యసభ సీటు ఇవ్వలేదని అందుకే ఆమె కోపంతో తెలంగాణలో పార్టీ పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అన్నతో షర్మిలకు ఆస్తి తగాదాలు ఉన్నాయని అన్నారు. గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలైయ్యారని, చాలా మంది భూములు అమ్మి.. స్వరం కోల్పోయారన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే తరహాలో నడుస్తోందని గోనె ప్రకాష్ మండిపడ్డారు. ఇలా వ్యక్తిగత కోపాల నేపథ్యంలో స్వలాభం కోసం పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దని షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. . వైఎస్ విజయలక్ష్మి కూడా కుమారుడి అభీష్టానికి వ్యతిరేకంగా కుమార్తె షర్మిలకు మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే ఉందని అన్నారు. అందుకే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు, వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ ఫోన్ చేస్తున్నారని ఆరోపించారు. , తెలంగాణలో పార్టీ పెట్టి రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవద్దని తల్లీకూతుళ్లకు గోనె ప్రకాష్ హితవు పలికారు. మొత్తంగా షర్మిల పార్టీని నమ్ముకుంటే సర్వనాశనమే అంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -