కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఫైనాన్షియల్ రిసోలుష్యన్ అండ్ డిపోజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు 2017 సామాన్యుడిపై గొడ్డలిపెట్టుగా మారింది.దివాలా తీయడానికి సిద్దంగా ఉన్న బ్యాంకులకు ఈ బిల్లు వరంగ మారనుంది. ఎందుకంటే ఎఫ్ఆర్డీఐ బిల్లు చట్ట రూపం దాలిస్తే డిపాజిటర్ల కొంపకొల్లేరే కానుంది. ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బు బ్యాంకులు దివాల తీస్తే ఖల్లాస్ కానున్నాయి.
వడ్డీ ఆదాయం ఎంతోమందికి ఆదాయ వనరు. అందుకే సామాన్యులు ఎక్కువగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకే మొగ్గుచూపుతారు. ఇంకొంతమంది పిల్లల పెళ్లికొసమో లేదా కొడుకుల చదువు,రిటైరయ్యాక హ్యాపీగా బతికేందుకు డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటారు. ఇలాంటి వారు ఇకపై ఆలోచించాల్సిన పరిస్ధితి వచ్చింది.
గతంలో ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ప్రభుత్వం కొంత పెట్టుబడిని సాయంగా అందించి ఆ బ్యాంకు తన రుణ సమస్యలనుంచి విముక్తి అవడానికి సహాయం అందేది. దీన్ని బెయిల్-అవుట్ ప్యాకేజీ అనేవారు. దీని ద్వారా డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉండేది. 1961లో రెండు బ్యాంకులు దివాలా తీశాయి. దీంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే దానిని నెలకొల్పి.. ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే డిపాజిటర్లకు రూ.లక్ష దాకా వారి పైకం తిరిగి చెల్లించే నిబంధనను చేర్చింది. ఇన్నాళ్లూ ఇదే నిబంధన అమల్లో ఉండేది.
కానీ కొత్త బిల్లులో కేంద్రం ‘‘బెయిల్-ఇన్’’ అనే క్లాజు చేర్చింది. రిజల్యూషన్ కార్పొరేషన్ ద్వారా ఖాతాదారుల డబ్బును వారి అనుమతి లేకుండా బ్యాంకు వారు వాడుకోవచ్చు. డిపాజిటర్ల డబ్బునే పెట్టుబడిగా పెట్టి అప్పులను తీర్చుకోవచ్చు.అంతేగాదు దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేసేయవచ్చు.అంటే మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదు.
బ్యాంకులను దివాళా తీయించడానికి ఈ బిల్లును తెచ్చారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లుతో ఎస్బీఐతో సహా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఎల్ఐసీతో సహా బీమా కంపెనీలు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు తీవ్ర ముప్పు వుందని బెఫీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పించలేని బ్యాంకులు, వ్యవస్థలెందుకన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతోంది.