పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కేంద్రం ఈ సమావేశాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19 ప్రొటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కోవిడ్ మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలుంటాయని భావిస్తున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు… రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.