చిరు ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం..కోట్ల రూపాయల నష్టం

353
sye raa

మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కోకాపేటలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో సుమారు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సమాచారం. కొద్దిరోజులుగా సైరాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చిరంజీవి సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైరా తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, విజయ్ సేతుపతి సహా పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో మనం సెట్‌తో పాటు సైరాకు సంబంధించిన సెట్ కూడా కాలిపోయింది. దీంతో షూటింగ్‌కు కొంత కాలం ఆటంకం ఎదురైంది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు.అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు సెట్‌ను తొలగించారు. ఈ కారణంగానూ సైరా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా చిరు ఫాంహౌజ్‌లో సైరా సెట్ కాలిపోవడం చర్చనీయాంశంగా మారింది.