పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం ధీటైన జవాబిచ్చింది. తాజాగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పులను ఎదుర్కొనే క్రమంగా భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 15మంది పాక్ రేంజర్లు హతమయ్యారు.
ఎల్వోసీలోని సుందర్బనీ, పల్లన్వాలా సెక్టార్లతో పాటు జమ్ము, కత్వా జిల్లాల్లో సరిహద్దు వెంబడి పాక్ సైన్యం నిన్నటి నుంచి కాల్పులకు తెగబడుతోంది. చిన్న తరహా ఆయుధాలు, ఆటోమెటిక్ మోర్టార్స్ తో శత్రు దళాలు దాడికి దిగినట్లు భారత ఆర్మీ పేర్కొంది. అయితే పాక్ దళాలను భారత ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది. మన సైనికులు ఎవరూ గాయపడలేదని బీఎస్ఎఫ్ పేర్కొంది. పాక్ సైన్యం ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూనే ఉందని బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పాక్ కాల్పుల్లో పల్లన్వాలా సెక్టార్‌లో ఓ వ్యక్తి మృతిచెందగా… రాజౌరీ సెక్టార్‌లో ఓ బాలిక గాయపడింది.
పాకిస్థాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు సైనికులతో పాటు 13 మంది పాక్ రేంజర్ల చనిపోయి ఉంటారని బీఎస్ఎఫ్ అంచనా వేస్తోంది. గత 24 గంటల నుంచి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. రాజౌరి, సాంబా, అబ్దులియా, ఆర్ ఎస్ పురా, సుచిత్గర్ ప్రాంతాల్లో ఏకథాటికి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
గత 12 గంటల నుంచి పాకిస్థాన్ ఆరు సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రదేశాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. పాక్ దళాలు జరుపుతున్న కాల్పులకు దీటైన జవాబు ఇస్తున్నట్లు రకణ శాఖ ప్రతినిధి మనీష్ మెహతా తెలిపారు. పాక్ దళాలకు దీటైన సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం బీఎస్ఎఫ్ దళాలకు ఆదేశాలిచ్చారు. గత వారం రోజులుగా జరుగుతున్న కాల్పుల ఉల్లంఘన వల్ల ఆరు ఏళ్ల చిన్నారి మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు.