ఫీజుకు ఢోకాలేదు..మార్చి 31లోగా చెల్లిస్తాం

181
Fees Reimbursement Scheme will continue
- Advertisement -

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదని సీఎం కేసీఆర్ మరోసారి సభకు స్పష్టం చేశారు. ఫిజు రీయింబర్స్ మెంట్‌ పథకంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన సీఎం…. ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో తాము ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నందున…గురువారం విపక్షాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

గతంలో ఫీజు బకాయిలే లేనట్టు ఇవాళే బకాయిలు ఉన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. రూ.1880 కోట్లు పెండింగ్‌లో ఉన్న బకాయిలను సైతం విడుదల చేసినట్లు వెల్లడించారు. 2011-12 టోటల్ డిమాండ్ రూ.2906 కోట్లు అవసరమైతే రూ.1492 కోట్లు విడుదల చేశామని వివరించారు. 2012-13లో టోటల్ డిమాండ్ రూ.3613 కోట్లు అవసరమైతే రూ.2063 కోట్లు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు డ్యూస్ చెల్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నామని…ఫీజు చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లను కళశాలు ఆపుతున్నట్లు సభ్యులు చెప్పారని…ప్రభుత్వమే ముందుండి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,687 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు విద్యా సంస్థలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని కుండబద్దలు కొట్టారు.

డబ్బులు ఇస్తున్నపుడు విద్యార్థికి ఉపయోగం కావాలి కాని సంస్థకు కాదన్నారు. స్టాండర్డ్‌లను బట్టి కాలేజీల్లో సీట్లు ఇస్తారు. ఎవరైనా పేద విద్యార్థి అలాంటి కాలేజీల్లో చదువుదామంటే వారికి డబ్బులు ఎక్కువగా ఇస్తున్నామని వివరించారు. దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో అన్యాయం జరగనీయమని స్పష్టం చేశారు. అనాధ విద్యార్థులను ఎస్సీలుగా పరిగణిస్తు…వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అనాథలకు ప్రభుత్వమే అమ్మ,నాన్న అని మరోసారి తేల్చిచెప్పారు.

తమ ప్రభుత్వం డీ మానిటైజేషన్‌కు మద్దతిచ్చిందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన సీఎం..తాము కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు విధానానికి మద్దతిచ్చామని….ఇది దేశానికి మంచి మద్దతునిస్తుందని పేర్కొన్నారు. డీ మానిటైజేషన్ వల్ల కష్టాలు నామ మాత్రమేనని…అంతిమ ఫలితం అద్భుతంగా ఉంటుందన్నారు.

- Advertisement -