బీజేపీ బండికి ఓటమి భయం..!

162
bandi sanjay
- Advertisement -

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ గెలుపు బలుపు కాదు వాపు అని నిరూపించుకోవాలంటే బండికి సాగర్‌లో గెలవడం కంపల్సరీ అయింది. సాగర్‌లో బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. అదే బండిని కలవరపెడుతోంది. అందుకే సాగర్ ఉప ఎన్నికలకు ముందే కీలక కాంగ్రెస్ నేతలకు కాషాయ కండువాలు కప్పుతూ…హస్తం పార్టీని దెబ్బతీసేందుకు బండి ప్రయత్నిస్తున్నాడు. అయితే సాగర్‌ ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఉండడం, అక్కడ క్షేత్ర స్థాయిలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తుండడం, అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీకి ఇక్కడ గెలిచే అవకాశాలు లేవని కాషాయనేతలు కూడా అంగీకరిస్తున్నారు. సాగర్‌లో ఓడిపోతే ఇప్పటి వరకు సాధించిన విజయాలు గాల్లో కలిసిపోయి…పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని బండి సంజయ్ ఆందోళన చెందుతున్నాడంట..దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి వంటి సీనియర్ నేత బరిలోకి ఉండడంతో కనీసం రెండో స్థానం అయినా దక్కుతుందా లేదా అని బండిలో భయం మొదలైందంట.

సాగర్‌లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండబోతుంది. ఇక్కడ బీజేపీ మూడవస్థానంలో నిలబడితే బండి పరువు పోయినట్లే..అందుకే సాగర్ ఉప ఎన్నికలలో బలమైన అభ్యర్థి కోసం బండి అన్వేషిస్తున్నాడు. తొలుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డిని పార్టీలోకి లాగాలని చూసాడు కాని వర్కవుట్ కాలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా స్థానిక బీజేపీలో నేతలు నిలబడలేరని బండి భావిస్తున్నాడు. టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతకు పార్టీలో చేర్చుకుని సాగర్‌‌లో పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం కూడా డిసైడ్ అయింది. అయితే సాగర్ బీజేపీలో కుమ్ములాటలు పార్టీకి తలనొప్పిగా మారాయి. సాగర్‌‌లో స్థానికంగా ముగ్గురు బీజేపీ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన నివేదితారెడ్డి, బీసీ నేత అంజయ్య యాదవ్‌తో పాటు, ఇటీవల పార్టీలో చేరిన రిక్కల ఇంద్రసేనారెడ్డి సాగర్‌‌లు బీజేపీ టికెట్ కోసం కొట్టుకుంటున్నారు. ఎవరికి వారు అధిష్టానం పెద్దలతో లాబీయింగ్ చేస్తూ తమకే టికెట్ అంటూ కొట్టుకుంటున్నారు. అసలే బలమైన అభ్యర్థి దొరకక తలపట్టుకుంటున్న బండి సంజయ్‌కు స్థానిక బీజేపీ నేతల వర్గ విబేధాలు మరింత తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో హాలియాలో జరిగిన బీజేపీ సభలో స్థానిక నేతల గొడవలతో కాషాయ నేతలు కంగుతిన్నారు.

నేతల తీరుపై తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్‌ అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. సాగర్ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహించిన తరుణ్ చుగ్ అప్పటికప్పుడు పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.. ఈ పరిణామాలపై బండి సంజయ్‌ అధిష్టానానికి ఏం చెప్పాలో తెలియక డైలమాలో పడిపోయాడు. ఈ నేపథ్యంలో సాగర్ బీజేపీ నేతలైన నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డిలకు బండి క్లాస్ తీసుకున్నాడు. టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేయాలని, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చాడంట…టికెట్ విషయమై ముగ్గురు నేతలకు క్లారిటీ ఇవ్వలేదంట..దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతకు బండి టికెట్ ఇవ్వడం ఖాయమని స్థానిక బీజేపీ నేతలు అనుకుంటున్నారు.. అదే జరిగితే మూడు వర్గాల నేతలు ఏకమై పార్టీ అభ్యర్థిని ఓడించాలని డిసైడ్ అయ్యారంట. సాగర్ బీజేపీలో చెలరేగిన అసమ్మతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదని బండి సంజయ్‌‌కు టెన్షన్ పట్టుకుందంట. అందుకే టికెట్ కోసం కొట్టుకుంటున్న ముగ్గురు కీలక నేతలను పిలిచి మరీ.. వర్గ విబేధాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని సీరియస్‌గా క్లాస్ తీసుకున్నాడని సమాచారం. మొత్తంగా ఉప ఎన్నికల పోలింగ్‌కు ముందే సాగర్ బీజేపీలో జరుగుతున్న రచ్చతో బండి సంజయ్ చేతులెత్తేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -