రైతు ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ కన్నుమూత

49
abhijeet
- Advertisement -

ప్రభుత్వ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ సోమవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు. రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్ సేన్ కు గుండెపోటు రాగా ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా అభిజిత్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారు.

బెంగాలీ కుటుంబానికి చెందిన అభిజిత్ సేన్… స్టీఫెన్స్ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చదివి… కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ ఛైర్మన్ తో సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. అభిజిత్ సేన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టున్న అభిజిత్ సేన్ .. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 2004 నుంచి 2014 వరకు భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా సేవలందించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు & ధరల కమిషన్ (సీఏసీపీ) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన దీర్ఘకాలిక ధాన్యం విధానంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను రచించారు. ఇది ఒక మైలురాయి నివేదికగా వివిధ వర్గాలు వర్ణించారు. సీఏసీపీని ఒక అధికార చట్టబద్ధమైన సంస్థగా మార్చాలని మరియు దాని కనీస మద్దతు ధరల నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించడానికి కట్టుబడి ఉండేలా ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్నారు. స్వామినాథన్‌ ఫార్ములాను ఉపయోగించి దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని అప్పుడే రైతులకు మంచి మేలు కలుగుతుందని ప్రభుత్వానికి సూచించారు.

ఎంఎస్‌ స్వామినాథన్ నేతృత్వంలోని రైతులపై జాతీయ కమిషన్లో మెంబర్‌గా పనిచేశారు. ఈ కమిటీ ఏప్రిల్ 2006లో తన తుది నివేదికను అందించింది. పంటల ఎంఎస్‌పీలు, C2 ఖర్చుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలని సిఫార్సు చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టంను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలను వేరుపరచడం ద్వారా దేశంలోని ప్రతి మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మందికి ఈ చట్టం ద్వారా అహార భద్రతా కల్పించారు. ఈయన కృషి ఫలితంగానే 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టంను రూపొందించారు అప్పటి యూపీఏ ప్రభుత్వం.

 

- Advertisement -