అతిలోకసుందిరి ఎలా మరణించింది..?

256
- Advertisement -

అందం, అభినయాల కలబోత ఎలా ఉంటుందో ఆమెని చూస్తే అర్థమవుతుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలిగే నటనా వైదుష్యం ఆమె సొంతం. ఎకాఎకి నాలుగు దశాబ్దాల పాటు ఇటు తెలుగు సహా దక్షిణాది చిత్రసీమ, అటు బాలీవుడ్‌లలో తిరుగులేని కథానాయికగా వెలుగులీనిన ఆమె… ధ్రువతారల చెంతకు చేరారు. నాలుగేళ్ల ప్రాయంలోనే బాలనటిగా తెరంగేట్రం చేసి నిన్నమొన్నటి వరకు వెండితెరపై అలరించిన ప్రఖ్యాత నటి శ్రీదేవి ఇక లేరు.

ఆదివారం మీడియాలో అందాల తార శ్రీదేవి హఠాన్మరణానికి సంబంధించిన కథనాలు, సంతాప సందేశాలు, ఆమె సినిమాలు, పాటలు, జ్ఞాపకాలు… ఇవి తప్ప మరో కార్యక్రమాలు లేవు. ఉన్నా ప్రాధాన్యం లేదు. శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోవడానికి దేశ ప్రజలకు ఇంకా కొంతకాలం పడుతుంది. ఆమె దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయిందని మీడియా తెలియచేసింది. అయితే ఆమె మరిది, నటుడు (బోనీ కపూర్‌ తమ్ముడు) సంజయ్‌ కపూర్‌ దుబాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమెకు గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని, గుండెపోటుకు సంబంధించిన మెడికల్‌ హిస్టరీ లేదని చెప్పారు. గతంలో ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా? ఇదే మొదటిసారా? తెలియదు.

Sridevi's Body To Be Brought Back To Mumbai Today

గుండెపోటుతో మరణించలేదని చెబుతున్నప్పుడు ఏ కారణం వల్ల చనిపోయిందో తెలియాలి కదా. హార్ట్‌ అటాక్‌కు సంబంధించిన చరిత్ర ఆమెకు లేదు కాబట్టే ఆ కారణంగానే మరణించిందని డాక్టర్‌లు చెప్పగానే తాము షాక్‌కు గురయ్యామని సంజయ్‌ కపూర్‌ చెప్పారు. ఆమె హోటల్‌ గదిలో శనివారం రాత్రి 11గంటల సమయంలో హఠాత్తుగా మరణించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయారని డాక్టర్లు చెప్పారు. దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడకల్లో ఆమె చాలా హుషారుగా, అందంగా, మెరిసిపోతూ కనిపించింది. ఈ వీడియోలు, ఫోటోలు టీవీ ఛానెళ్లలో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమె అనారోగ్యంతో ఉన్న ఛాయలూ కనిపించలేదు. దుబాయ్‌ నిబంధనల ప్రకారం భౌతిక కాయానికి ఫోరెన్సిక్‌ పరీక్షలు చేశారు.

అంత్యక్రియలు ముగిశాక ఆమె మరణానికో లేదా అనారోగ్యానికో సంబంధించిన కథనాలు బయటకు రావొచ్చు. పాప్‌ సింగర్‌ మైకేల్‌ జాక్సన్‌, శ్రీదేవి ఇద్దరూ అందాన్ని కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకున్నారని, ఇవి ప్రతికూల ప్రభావం చూపడంతో ఇద్దరూ చిన్న వయసులోనే చనిపోయారని కొందరంటున్నారు. వయసు మీద పడుతున్నప్పటికీ అందానికి విపరీతంగా ప్రాధాన్యం ఇవ్వడం, స్లిమ్‌గా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకోవడం, మందులు వాడటం వీరి బలహీనత.

ఈ విషయంలో మైకేల్‌ జాక్సన్‌, శ్రీదేవి మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ చిన్న వయసులోనే ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారు. అతిలోక సుందరి ఆ తరువాత కూడా లైఫోసక్షన్‌తో అనేక రకాల సర్జరీలు చేయించుకున్నట్లు సమాచారం. మైకేల్‌ జాక్సన్‌ గుండెపోటుతో చనిపోయాడు. శ్రీదేవి అదే కారణంతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. విశేషమేమిటంటే శ్రీదేవి మైకేల్‌ జాక్సన్‌ అభిమాని.

- Advertisement -