మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కన్నుమూత….

139
pranab

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో కోమాలోకి వెళ్లారు ప్రణబ్. అప్పటినుండి వెంటిలెటర్‌ పైనే చికిత్స అందిస్తుండగా పరిస్ధితి క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు.

డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ప్రణబ్ ముఖర్జీ.రాజనీతి శాస్త్రం, చరిత్రలో ఎం.ఎ. చేసిన ప్రణబ్ …కోల్ కతా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందారు.1963లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు. డి. సి) ఉద్యోగంలో చేరాడు.తరువాత విద్యానగర్ కళాశాలలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు. రాజకీయాలలోనికి రాకముందు దేషెర్ దక్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు

1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి వి. కె. కృష్ణ మేనన్కు ప్రచార బాధ్యతలు చేపట్టడంతో రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అతని ప్రతిభను గుర్తించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించింది.

1969లో రాజ్యసభకు ఎన్నికైన ప్రణబ్ ….ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయునిగా పనిచేశారు. ఇందిరా గాంధీ కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా పనిచేశారు. 1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ,1980లో సభా నాయకుడిగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్‌కు దూరమైన ప్రణబ్…1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్. ఎస్. సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెకు రాజకీయ గురువుగా బాధ్యతలను చేపట్టారు. 1998–99 లో ఎ.ఐ.సి.సికి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2012 జూలై 25న 13వ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.