పల్లెల్లు, పట్టణాలు, ప్రజలు బాగుండాలనే సీఎం కెసిఆర్ ఆర్తి. పల్లె ప్రగతి స్ఫూర్తి… పల్లెల్లో ప్రజల జీవిత నాణ్యత, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా, గ్రామ పంచాయతీల పరిపాలనా సమార్థ్యాలను మెరుగుపర్చడమే ధ్యేయంగా, పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రతతోపాటు సీజనల్ వ్యాధుల నివారణే కర్తవ్యంగా, సిఎం కెసిఆర్ ఆదేశాలతో జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అభివృద్ధిలో లాగే, పల్లెల్లో పచ్చదనం-పారిశుద్ధ్యం పై అవగాహన పెంచుతూ, ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రజాప్రతినిధుల్లో, అధికారుల్లో జవాబుదారి తనాన్ని పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజలంతా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
సిఎం కెసిఆర్ ఆదేశాలతో జూన్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమ లక్ష్యాలు, విధుల వివరాలను మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్బంగా వివరించారు. సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి స్ఫూర్తితో…సీజన్ వ్యాధులను అరికడదాం. రెండు సార్లు విజయవంతమైన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, కరోనా తరహాలో, వచ్చే వర్షాకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కోందాం. అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంతోపాటు, నీరు నిలువ ఉండే చోట్లను గర్తించి, నివారిద్దాం. మంచినీటిని పరిశుభ్రంగా…స్వచ్ఛంగా ప్రజలకు అందిద్దాం. దోమలు పెరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపడదాం. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యంపై అవగాహన పెంచి సిఎం కెసిఆర్ కలలు గంటున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దామని మంత్రి ఎర్రబెల్లి, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సిఇఓలు, డిఆర్ డిఓలు, గ్రామ కార్యదర్శులు, అధికారులందరికీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతా కలిసి కట్టుగా సీజనల్ వ్యాధులే రాకుండా జాగ్రత్త పడదాం అని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్యం వంటి అన్ని కార్యక్రమాల పట్ల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు.
*ప్రత్యేక పారిశుద్ధ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు*
జూన్ 1వ తేదీన గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులతో కలిసి ఎవరి గ్రామాల్లో వారు పర్యటించాలి. సమస్యలను గుర్తించాలి. నీటి నిల్వలను మూయించాలి. ఆ తర్వాత గ్రామ పంచాయతీలో సమావేశమవ్వాలి. 8వ తేదీ వరకు 8 రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే ఆ ప్రణాళికలను ప్రజలకు తెలిపి. వారి భాగస్వామ్యంతో పచ్చదనం-పారిశుద్ధ్యం కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి చెప్పారు.
*పారిశుద్ధ్య విధులు*
సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీల సభ్యులు నీరు నిల్వ ఉండే చోట్లను గుర్తించి, తొలగించాలి. డ్రైనేజీల్లో నీరు నిలువ ఉండకుండా చేయాలి. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లేలా ఇప్పుడే ఏర్పాట్లు చేయాలి. ఇంటింటికీ ఇంకుడు గుంతలు పెట్టాలి.
గ్రామాల్లో క్లోరిన్ అవశేషాలను చెక్ చేస్తూ, స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలు అందించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. యథావిధిగా ప్రతి నెలా 1,11,21 తేదీల్లో, ప్రతి 10 రోజులకోసారి ట్యాంకులను శుభ్రపరచాలి. లీకేజీలు లేకుండా, నీరు కలుషితం కాకుండా చూడాలి. ప్రతి శుక్రవారాన్ని డ్రై డే గా పాటిస్తూ, ఆరోజు ప్రతి ఇంటిలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
దోమల నివారణకు ముందుగానే ఆయా ప్రాంతాలను గుర్తించి, దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్లు పంచాయతీ, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి దయాకర్ రావు ఆదేశించారు. దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో శిబిరాలు పెట్టడం, ఫాగింగ్ చేయడం, మలేరియా బాల్స్ స్ప్రే చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.
పల్లెల్లో పక్కాగా పారిశుద్ధ్యం ఉండేలా చూడాలని చెప్పారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయాలన్నారు. ఒకవైపు ఇప్పటికే కరోనా వైరస్ ఇంకా మనతోనే ఉంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు జాగ్రత్త వహించకపోతే సీజనల్ వ్యాధులతోపాటు, కరోనా ప్రబలితే కష్టకాలం వస్తుంది. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల మీదే ఆధారపడి ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అప్రమత్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, దళిత వాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హై రిస్క్ ఉన్న ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు క్షేత్ర పరిశీలనకు వెళ్ళాలి. నిధులకు కొరత లేదు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
*చెత్త వేస్తే జరిమానాలు- పారిశుద్ధ్యం పాటిస్తే అదుపులో సీజనల్ వ్యాధులు*
ముందుగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పండి. చెత్త వేస్తే రూ.500 జరిమానాలు వేయండి. ప్రత్యేక పారిశుద్ధ్యాన్ని పాటిస్తే, సీజనల్ వ్యాధులు అదుపులోనే ఉంటాయి. ప్రత్యేక పారిశుద్ధ్య లక్ష్యాలను తెలుపుతూ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ, అధికారులు-ప్రజాప్రతినిధుల జబాబుదారితనాన్ని పెంచాలి. నిర్లక్ష్యంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారుల ఉదాసీనతను ఉపేక్షించేది లేదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
*కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించాలి, సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలి*
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించే సమయాల్లోనూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక, భౌతిక దూరం పాటించాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. స్వీయ నియంత్రణతోనే ప్రత్యేక పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కరోనా పల్లెల్లోకి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల ద్వారా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సూచించారు.
*పల్లె ప్రగతే స్ఫూర్తిగా…ప్రత్యేక పారిశుద్ధ్యం…కరోనా సహా సీజనల్ వ్యాధులు మటు మాయం*
సిఎం కెసిఆర్ గారిచ్చిన పిలుపు మేరకు గత రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి అద్బుత ఫలితాలిచ్చింది. పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరుస్తోంది. ఆ పల్లె ప్రగతి కార్యక్రమాలే గ్రామాలను కరోనా నుంచి కాపాడాయి. పల్లెల్లో కరోనా ప్రబలలేదు. ఇప్పుడే అదే పల్లె ప్రగతిని కొనసాగిస్తూ, తాజాగా సిఎం కెసిఆర్ చెప్పినట్లు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పల్లెలను పచ్చదనం-పరిశుభ్రతతో ఉంచుదాం. కరోనాతోపాటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ముందే జాగ్రత్త పడదాం.. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు.