హిందూవులకు తాను పెద్ద అభిమానినంటూ ప్రవాస భారతీయ ఓటర్లకు ఊదరగొట్టిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మళ్లీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగాల దొంగతనంలో అమెరికన్లు జీవిస్తున్నారని, భారత్, చైనా, మెక్సికో, సింగపూర్లు అమెరికన్ కంపెనీల ఉద్యోగాలను తన్నుకుని పోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలోకి చైనా ప్రవేశించినప్పటి నుంచి అమెరికా 70వేల ఫ్యాక్టరీలను కోల్పోయిందని విమర్శించారు. ఈ సంక్షోభానికి మూలకారణం బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్లేనని మండిపడ్డారు. తాము కోల్పోయినంత జాబ్స్ ఓ దేశం నష్టపోలేదని, ఈ సమస్యను తాము వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టంపా, ఫ్లోరిడాలో తన మద్దతుదారులతో కలిసి ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా భారతీయులు, చైనీస్, సింగపూర్ వాసులు తమ ఉద్యోగాలను దోచుకెళ్లారని విమర్శించారు.
గుడ్రిచ్ లైటింగ్ సిస్టమర్స్ 255 వర్కర్లను తొలగించి, వారి ఉద్యోగాలను భారత్కు తరలించిందని, బాక్స్టర్ హెల్త్ కేర్ కార్పొరేషన్ 199 ఉద్యోగులను తొలగించి, ఆ ఉద్యోగాలను సింగపూర్కు మరలించిందని ఆరోపించారు. ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిని నిర్మూలించడంతో అమెరికన్ ఓటర్లతో తన తొలి కాంట్రాక్ట్ను ప్రారంభమవుతుందని ట్రంప్ హామీ ఇచ్చారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందితే, ఇప్పటివరకు అపహరించుకుపోయిన అమెరికన్ ఉద్యోగాలను మళ్లీ వెనక్కి తీసుకొస్తానని చెప్పారు. బిల్ క్లింటన్ కుదుర్చిన నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎన్ఏఎఫ్టీఏ) ఒప్పందం వల్ల ఫ్లోరిడా ఉద్యోగాల్లో ప్రతి నాలుగింట ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రంప్ అన్నారు. ట్రంప్ పరిపాలన వ్యవస్థలో అమెరికా నుంచి బయటికి తరలిపోతున్న ఉద్యోగాలను బ్రేక్ వేసి, ఫ్లోరిడాను అత్యున్నత ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు.
తాను గెలిస్తే ఎన్ఏఎఫ్టీఏ ఒప్పందంపై పునఃసమీక్షిస్తానని, ఈ డీల్ను రద్దు చేసుకుని, తమ వర్కర్ల కోసం ఓ మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని చెప్పారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్పై ట్రంప్ మండిపడ్డారు. ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యంతో ఉద్యోగాల నిర్మూలనను వెంటనే ఆపివేయాలని హెచ్చరించారు. ఉద్యోగాలను వెనక్కి తెచ్చే క్రమంలో అమెరికన్ బిజినెస్లకు తక్కువ పన్నుల వేస్తామని(35 శాతం నుంచి 15 శాతం పన్నులు) ట్రంప్ హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులున్న దేశం అమెరికానేనని, అమెరికన్ వ్యాపారాలు వేరే దేశానికి వెళ్లడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని విమర్శించారు.