టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భవితవ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు కోచ్ రవిశాస్త్రి. ధోని ఇకపై వన్డేల నుంచి పూర్తిగా తప్పుకుని టీ20లపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాడని వెల్లడించారు.
తాను ధోనితో మాట్లాడాను. ఏం చర్చించుకున్నామనేది మాకు మాత్రమే తెలుసని చెప్పాడు. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పినట్లుగానే త్వరలో వన్డేల నుంచి కూడా తప్పుకోబోతున్నాడని స్పష్టం చేశాడు. మహీ వయసును బట్టి చూస్తే టి20 ఫార్మాట్‌లోనే ఆడాలనుకుంటున్నాడు. సాధన మొదలు పెట్టి ఐపీఎల్ బరిలోకి దిగిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యేందుకు ధోనికి మంచి అవకాశాలున్నాయని…ఒకవేళ ధోని జట్టులోకి వస్తే అతని అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఇక నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపై విభేదించాడు శాస్త్రి. నాలుగు రోజుల టెస్టు ఆలోచన అర్థరహితం…. ఇది ఇలాగే సాగితే పరిమిత ఓవర్ల టెస్టులు వస్తాయేమోనన్న సందేహం వ్యక్తం చేశాడు. అయితే ధోని వన్డే కెరీర్ ముగిసినట్లేనని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.